: ఇటలీలో భారీ భూకంపం.. అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని
మధ్య ఇటలీ ప్రాంతంలో భూకంప లేఖినిపై 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి రెండు గంటల ముందు కూడా భూప్రకంపనలు సంభవించాయని, వాటి తీవ్రత 5.4గా నమోదయిందని అమెరికా భూభౌతిక పరిశోధనా సంస్థ పేర్కొంది. భూకంపం వల్ల తలెత్తిన ప్రాణ నష్టంపై ఇంకా సమాచారం అందలేదు. భూకంప కేంద్రం రోమ్‌కు దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రజ్ఞులు తెలిపారు. మార్చీ ప్రాంతంలోని కాస్టిలాంజింలో సుల్‌నీరా పట్టణంపై ఈ భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విస్సో పట్టణంలో పలువురికి గాయాలయినట్లు, అక్కడి ఒక పురాతన చర్చి ధ్వంసమైనట్లు సమాచారం. విద్యుత్తు, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. భూకంపం కారణంగా ఇటలీ ప్రధాని మాట్టీయో రెన్జీ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక కార్యక్రమాలపై సమీక్ష జరిపారు.