: పనిమనిషితో భర్త లీలలు... బట్టబయలు చేసిన రామచిలుక
మనం మాట్లాడే కొన్ని మాటలను రామచిలుకలు ముద్దుముద్దుగా వల్లెవేయడం మనకు తెలిసిందే. అదే ఇప్పుడు ఓ పెద్దమనిషికి ఊహించని చిక్కుల్ని తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే, పనిమనిషితో శృంగారలీలలు జరుపుతూ, ఆమెతో అయ్యగారు చెప్పిన ముద్దుముద్దు మాటల్ని విన్న రామచిలుక... అవే మాటలను ఆయన భార్య వచ్చినప్పుడు పలికేసింది. దీంతో, తన భర్త చిలక్కొట్టుడు వ్యవహారం భార్యకు అర్థమయింది. తాను ఇంట్లో లేని సమయంలో తన భర్త చేస్తున్న నిర్వాకమేంటో ఆమెకు క్లియర్ అయింది. దీంతో పోలీస్ స్టేషన్లో తన భర్త అక్రమ సంబంధంపై ఆమె ఫిర్యాదు చేసింది. తన భర్త తనను మోసం చేస్తున్నాడనే అనుమానం తనకు చాలా కాలంగా ఉందని, ఆ అనుమానం ఇప్పుడు నిజమైందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన కువైట్ లో జరిగింది. ఈ విషయాన్ని అరబ్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. తాను ఆఫీసు నుంచి త్వరగా వస్తే తన భర్త కుంగిపోతున్నాడని పోలీసులకు ఆమె తెలిపింది. అయితే, టీవీల్లో చూసిన సన్నివేశాలను కూడా చిలుక పలికి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. చిలుక పలుకల ఆధారంగా నేరాన్ని నిరూపించడం కష్టమని వారు అంటున్నారు. మరోవైపు, గల్ఫ్ దేశాల్లో అక్రమ సంబంధాలను కలిగి ఉండటం నేరం. నేరం చేసినట్టు తేలితే కఠిన శిక్షలు విధిస్తారు.