: కోల్డ్ వార్ తరువాత ఇదే మొదటిసారి... రష్యా సరిహద్దుల్లోకి బ్రిటన్ యుద్ధ విమానాలు, యూఎస్ ట్యాంకర్లు
ప్రచ్ఛన్న యుద్ధం తరువాత రష్యా సరిహద్దుల్లో అమెరికా, బ్రిటన్ దళాలు తమ సైన్యాన్ని, యుద్ధ విమానాలను మోహరించాలని సంచలన నిర్ణయం తీసుకున్నాయి. రొమేనియాకు వచ్చే సంవత్సరంలో యుద్ధ విమానాలను పంపనున్నట్టు బ్రిటన్ స్పష్టం చేయగా, పోలాండ్, రష్యా సరిహద్దులపై సైన్యాన్ని, ట్యాంకర్లను, ఇతర ఆయుధాలను మోహరిస్తామని అమెరికా తెలిపింది. కోల్డ్ వార్ తరువాత రష్యా సరిహద్దుల్లో నాటో దళాల అతిపెద్ద మిలటరీ మోహరింపు ఇదేనని తెలుస్తోంది. ఇప్పటికే మరో ప్రపంచ యుద్ధం రానుందని, తమ దేశపు వాసులు అంతా స్వదేశానికి వచ్చేయాలని, అణు యుద్ధం జరుగుతుందని పలు వ్యాఖ్యలు చేసిన రష్యా, పూర్తి సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్టు సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న జర్మనీ, కెనడాలు సైతం తమ దళాలను నాటో సైన్యంతో కలుపుతామని హామీ ఇచ్చాయి. స్వీడన్, డెన్మార్క్ మధ్య ఉన్న బాల్టిక్ సముద్రంలో క్రూయిజ్ మిసైళ్లతో ఉన్న రెండు రష్యా యుద్ధ నౌకలు ప్రవేశించి, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచిన నేపథ్యంలో జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిరియా తీరంలో 10 వరకూ రష్యా యుద్ధ నౌకలు ఉండగా, అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌక అడ్మిరల్ కుజెనెత్సోవ్ ను వీటితో పాటు మోహరించాలని రష్యా నిర్ణయించింది. ఈ ప్రాంతంలో 4 వేల మంది వరకూ రష్యా సైన్యం ఉందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ పేర్కొన్నారు. మాస్కో సమీపంలోని రష్యా పశ్చిమ సైనిక కేంద్రంలో 3.3 లక్షల మంది ఉన్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. కాగా, ఉక్రెయిన్ లోని రెబెల్స్ కు మద్దతిచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న రష్యా, ఈ నెలలో అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యమున్న ఇస్కాండర్ మిసైల్స్ ను సిద్ధం చేసుకుంది. గతంలో అమెరికాతో కుదుర్చుకున్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక కనీసం 4 వేల మంది సైన్యంతో ఉండే నాలుగు బ్యాటిల్ గ్రూప్ లను మరో మూడు నాలుగు నెలల్లోగా సిద్ధం చేసుకుని, అవసరమైతే వారికి మద్దతుగా వెళ్లేందుకు 40 వేల మంది అదనపు సైన్యాన్ని రెడీగా ఉంచుకోవాలన్నది నాటో ప్లాన్ గా తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్ స్పందిస్తూ, యుద్ధానికి సిద్ధంగా ఉండే సైనిక బలగాలను సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే తూర్పు పోలాండ్ ప్రాంతానికి 900 మందిని పంపామని, మరో సైనిక దళాన్ని ట్యాంకులు, భారీ ఆయుధాలను యూరప్ తీర ప్రాంతంలో మోహరించనున్నామని వెల్లడించడం గమనార్హం.