: 'మొనాలిసా ఆఫ్ ఆఫ్ఘన్'ను అరెస్ట్ చేసిన పాక్... 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం


అందమైన నీలి కళ్లు, ఆ కళ్లలో అంతులేని కోపం... 12 ఏళ్ల వయసులో ఉన్న షర్బత్ గులా ఫొటో ఇది. ఆ బాలిక ఫొటోను 1985లో నేషనల్ జియోగ్రఫిక్ మేగజీన్ తన కవర్ పేజ్ పై ముద్రించింది. ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. 1984లలో ఆఫ్ఘనిస్థాన్ వలసలకు ఆ బాలిక ఫొటో ఓ సజీవ సాక్ష్యం. ఈ ఫొటోతో గులా మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, 'మొనాలిసా ఆఫ్ ఆఫ్ఘన్'గా పేరుపొందింది. స్టీవ్ మెక్ కర్రీ అనే ఫొటోగ్రాఫర్ శరణార్థుల శిబిరంలో ఆమె ఫొటోను తీశాడు. ఇప్పుడు షర్బత్ గులా పెరిగి పెద్దదైంది. పాకిస్థాన్ లోని పెషావర్ దగ్గర ఉన్న నోథియాలో ఆమె తలదాచుకుంది. పాకిస్థాన్ లో తలదాచుకున్న వేలాది మంది ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుల్లో ఆమె కూడా ఒకరు. పాక్ వచ్చిన తర్వాత ఆమె ఓ పాకిస్థానీని పెళ్లాడింది. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇంత చరిత్ర గల షర్బత్ గులాను నిన్న పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1988 షర్బత్ గులా నకిలీ పాకిస్థానీ ఐడెంటిటీ కార్డును, 2014లో కంప్యూటరైజ్డ్ ఐడెంటిటీ కార్డును పొందిందని వారు తెలిపారు. గులాపై దాదాపు ఏడాది పాటు ఇన్వెస్టిగేషన్ జరిపి, నిన్న ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు ఆఫ్ఘన్ పాస్ పోర్టు కూడా ఉందని... 2014లో ఆ పాస్ పోర్టుతోనే హజ్ కు వెళ్లిందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఆమెకు 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని డాన్ పత్రిక తెలిపింది.

  • Loading...

More Telugu News