: 29న కయాంత్ తీరం దాటే అవకాశం... కోస్తాలో టపాసుల వ్యాపారుల ఆందోళన!
బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి, గంటగంటకూ ఉద్ధృతమవుతూ తీవ్ర వాయుగుండంగా మారుతున్న కయాంత్, శనివారం సాయంత్రానికి చెన్నై నుంచి విశాఖ మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను బలాన్ని ముందే అంచనా వేస్తున్న వాతావరణ శాఖ, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించగా, తీరం వెంబడి అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇక కయాంత్ ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురవవచ్చని, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కయాంత్ కేంద్రీకృతమై ఉంది. ఇది నెల్లూరు వద్ద తీరం దాటవచ్చని, ఒకవేళ దిశ మార్చుకుంటే, మచిలీపట్నం, విశాఖ మధ్య తీరం దాటుతుందని అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, ఈ సంవత్సరం దీపావళి పర్వదినం నిమిత్తం కోట్లాది రూపాయలను వెచ్చించి తీసుకువచ్చిన టపాకాయల విక్రయాలపై భారీ వర్షాల ప్రభావం పడితే, తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ శని, ఆది వారాల్లో వర్షాలు కురిస్తే, టపాకాయల అమ్మకాలు 70 నుంచి 80 శాతం వరకూ పడిపోతాయని వ్యాపారుల అంచనా.