: వైద్య విద్యార్థిని సంధ్యారాణి మరణంతో భర్త మనస్తాపం.. ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం.. బ్రెయిన్‌డెడ్!


గుంటూరు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ వేధింపులకు తట్టుకోలేక నల్గొండ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య మరణాన్ని తట్టుకోలేని ఆమె భర్త డాక్టర్ రవి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవి పరిస్థితి విషమంగా ఉంది. అతడికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలించనున్నారు. రవికి బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలుస్తోంది. డాక్టర్ రవి ఆత్మహత్యాయత్నంతో సంధ్యారాణి, రవి కుటుంబాల్లో విషాదం నెలకొంది. రవి, సంధ్యారాణికి పది నెలల క్రితమే వివాహమైంది. అంతలోనే ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. సంధ్యారాణిని వేధించిన డాక్టర్ ఏవీవీ లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా పరారీలో ఉన్న కాలేజీ ప్రొఫెసర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లికి తీసుకున్న సెలవుల విషయంలో ప్రొఫెసర్ ఏవీవీ లక్ష్మి దుర్భాషలాడారని, ఆమె వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సంధ్యారాణి తన డైరీలో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంధ్యారాణి మృత్యువుతో పోరాడుతూ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News