: ప్రేమకు అడ్డంగా ఉందని ప్రేమికురాలి అక్కను ఫేస్‌బుక్‌లో వేధించిన యువకుడి అరెస్ట్
తన ప్రేమకు అడ్డంగా ఉందని భావించి ఫేస్‌బుక్ ద్వారా ప్రేమికురాలి అక్కను వేధించిన యువకుడికి పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరులోని జయలక్ష్మిపురంలో ఓ మహిళ తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి నివసిస్తోంది. స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమె చెల్లెలితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయం తెలుసుకున్న లెక్చరర్ యువకుడిని హెచ్చరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు అధ్యాపకురాలి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ తెరిచాడు. దాని నుంచి ఆమె పనిచేస్తున్న కళాశాలలోని విద్యార్థులు, ఆమె బంధువులు, సన్నిహితులకు అశ్లీల వీడియోలు షేర్ చేయడం మొదలుపెట్టాడు. కొందరు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో అశ్లీల చాటింగ్‌లు చేయడంతోపాటు ఆమె ఫోన్ నంబరును అందరికీ షేర్ చేశాడు. దీంతో ఆమెకు బయట వ్యక్తుల నుంచి ఇబ్బందికరంగా ఫోన్లు వచ్చేవి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అయితే నిందితుడి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.