: ఒక్క ప్రకటనతో ప్రపంచాన్ని భయపెడుతున్న రష్యా
ఒకే ఒక్క ప్రకటనతో రష్యా ప్రపంచం గుండెల్లో గుబులు రేపుతోంది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన అణు బాంబుల కంటే వెయ్యిరెట్లు శక్తిమంతమైన అణు క్షిపణిని తయారు చేస్తామన్న రష్యా ప్రకటనతో బెంబేలెత్తిపోతోంది. ప్రపంచంలోని ప్రతి దేశానికి సరిహద్దు దేశాలతో సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు? ఎక్కడ? ఎలాంటి? ఉపద్రవం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో ఉగ్రవాద సంస్థలు చాపకింద నీరులా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ప్రకటన ఆందోళన రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... 9600 కిలోమీటర్ల (6000 మైళ్లు) దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోగల ‘సతాన్-2’ అనే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన అణుక్షిపణిని రెండేళ్లలో తయారు చేయనున్నామని రష్యా ప్రకటించింది. లక్ష్యంగా ఎంచుకున్న 16 నిర్దేశిత ప్రాంతాలపై ఈ తరహాకు చెందిన ఒకే ఒక్క క్షిపణితో దాడిచేసే సామర్థ్యం సొంతమవుతుందని రష్యా చెబుతోంది. ఒక్కసారి బటన్ నొక్కితే చాలు, దాదాపు ఫ్రాన్స్ లాంటి దేశాన్ని సర్వనాశనం చేసే సామర్థ్యం దీని సొంతమని ఈ ప్రకటనలో తెలిపింది. దీనిని రెండేళ్లలో అందుబాటులోకి తేవడమే తమ ముందున్న లక్ష్యమని రష్యా వెల్లడించింది. ఈ క్షిపణిని ప్రయోగిస్తే ఏర్పడే తీవ్రత(నష్టాన్ని) తెలియజేసే చిత్రాలను, ప్రణాళికను రష్యా విడుదల చేసింది.