: అమర్ సింగ్ ను అవమానిస్తూ వెలిసిన పోస్టర్లు!
ఉత్తరప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో అంతర్గత కలహాలు ఎంత తీవ్ర స్థాయికి వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరుపై శివపాల్ యాదవ్ ఒక రేంజ్ లో విరుచుకుపడటం, ఈ విషయంలో అఖిలేష్ కు మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్ బాసటగా నిలవడం.. పార్టీ అధినేత ములాయం సింగ్ వారికి సర్దిచెప్పడం తెలిసిందే. ఇటీవల జరిగిన సమావేశంలో తన తండ్రి ములాయంపై సైతం అఖిలేష్ మండిపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ చీలిపోతుందని, అఖిలేష్ వేరు కుంపటి పెడతాడనే వార్తలు హల్ చల్ చేశాయి. ఆ తర్వాత అదేమీ లేదని, తమ కుటుంబం అంతా ఒకటేనని ములాయం ప్రకటించడంతో సమస్య సద్దు మణిగిందనుకున్నారు. కానీ, అక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, అఖిలేష్ పై వ్యతిరేకత వ్యక్తం చేసే వారిని కించపరుస్తూ పోస్టర్లు వెలుస్తున్నాయి. తాజాగా, ఎస్పీ నేత అమర్ సింగ్ పై లక్నోలో వెలిసిన పోస్టర్లే ఇందుకు ఉదాహరణ. అమర్ సింగ్ ను ఒక శునకంతో పోలుస్తూ ఉన్న పోస్టర్ లోని రాతలు ఆయన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఆ శునకంపైన ‘నేను అమర్ సింగ్ ను’ అని, ‘కుక్కతోక వంకరే, అది ఎప్పటికీ సరికాదు’ అనే వ్యాఖ్యలతో పాటు, ‘ఇంట్లో మనుషుల మధ్య తాను తగాదాలు పెడతానని’ ఆ పోస్టర్ పై రాసి ఉంది. కాగా, శివపాల్ యాదవ్, అమర్ సింగ్ తనకు, పార్టీకి ఎంతో అండగా ఉన్నారని ములాయం ఇటీవల కొనియాడారు. పార్టీ అధినేత చెప్పిన విషయాలను కూడా పట్టించుకోని అఖిలేష్ వర్గీయులు ఈ విధంగా పోస్టర్లు వేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.