: హృదయాలు కలిపిన కాలేయం!
కనీసం పేరు కూడా తెలియని వాళ్లను కాలేయం కలిపింది. అవును.. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ యువతికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఓ యువకుడు దానం చేశాడు. అనంతరం తనకు కాలేయ భాగాన్ని దానం చేసిన వ్యక్తినే ఆ యువతి వివాహమాడింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఇల్లినాయిస్కి చెందిన ఫ్రాన్స్కోర్ట్లో ఉండే హెదర్ క్రూగర్ అనే యువతి రెండేళ్ల క్రితం తన కాలేయం పాడైపోయిందని వైద్యుల ద్వారా తెలుసుకుంది. ఆమె బతకాలంటే దాతలు ఎవరైనా కాలేయం దానమివ్వాల్సిందేనని వైద్యులు చెప్పారు. ఊహించని విధంగా షాక్కు గురైన ఆమె దాతల కోసం వెతికి వెతికీ విసిగిపోయింది. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంది. ఈ సమయంలో ఆమె గురించి క్రిస్ డింప్సే అనే వ్యక్తికి తెలిసింది. కాలేయం దానం చేసి ఆమెకు సాయపడతానని చెప్పాడు. వైద్యులు అతడికి టెస్టులు చేసి అతని కాలేయం హెదర్కి సరిపోతుందని గుర్తించారు. గత ఏడాది మార్చిలో శస్త్రచికిత్స చేసి ఆ యువకుడి కాలేయంలో కొంతభాగాన్ని సదరు యువతికి అమర్చారు. ఈ నేపథ్యంలోనే క్రిప్స్, క్రిస్ మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం వారి స్నేహం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకొని భార్యాభర్తలయిపోయారు. ఈ సందర్భంగా క్రిస్ మాట్లాడుతూ... తాను హెదర్ పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఆమె స్థితిలో తన కుటుంబ సభ్యులే ఉన్నట్లుగా భావించానని చెప్పాడు. అందుకే ఆమెతో పరిచయం లేకున్నా కాలేయం ఇచ్చానని పేర్కొన్నాడు. కొత్త పెళ్లికూతురు హెదర్ మాట్లాడుతూ... తనకు తెలిసినంతవరకు క్రిస్ ఒక గొప్ప వ్యక్తి అని చెప్పింది. క్రిస్ తన మీద నమ్మకాన్ని ఉంచాడని పేర్కొంది. ఇప్పుడు తాను నవ్వుతూ అందరి మధ్యలో ఉన్నానని చెప్పింది.