: గవర్నర్ ను కలిసిన యూపీ సీఎం అఖిలేశ్.. రాజీనామా చేస్తారని ఊహాగానాలు
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో వచ్చిన విభేదాల కారణంగా ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ ఈ రోజు ఉదయం తన నివాసంలో తనకు మద్దతుగా నిలిచిన తమ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. త్వరలో అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో చేపట్టనున్న ఎన్నికల ప్రచారం యాత్రపై అందులో చర్చించినట్లు అందరూ భావించారు. అయితే, ఆ సమావేశం అనంతరం అఖిలేశ్ యాదవ్ అక్కడి నుంచి బయలుదేరి రాజ్‌భవన్ చేరుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ శ్రీరాం నాయక్‌తో ఆయన భేటీ అయ్యారు. దీంతో, అఖలేశ్ రాజీనామా చేస్తారని, ముందస్తు ఎన్నికలకు వెళతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరికాసేపట్లో అఖిలేశ్ మీడియాతో మాట్లాడి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.