: అవగాహనతోనే బ్రెస్ట్ కేన్సర్ దూరం.. పింక్ రిబ్బన్ వాక్‌లో కవిత
అందరి కోసం పనిచేసే మహిళ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బ్రెస్ట్ కేన్సర్ కారణంగా ఎందరో అమ్మలు, అక్కలను పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి అటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో అవగాహన కోసమే పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాధిని గుర్తించిన తర్వాత చికిత్సకు వెళ్లడం కంటే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. బ్రెస్ట్ కేన్సర్ ఒకటి వస్తుందని తెలియని వారు చాలామంది ఉన్నారని, అటువంటి వారిలో అవగాహన కల్పించేందుకు బసవతారకం కేన్సర్ ట్రస్ట్ పింక్ రిబ్బన్ వాక్‌ను నిర్వహిస్తోందని, వారికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. బాలకృష్ణ లాంటి సెలెబ్రిటీలు ఈ అంశం గురించి చెబితేనే అందరికీ చేరుతుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమ పాత్ర పోషించాలని కోరారు. బ్రెస్ట్ కేన్సర్‌ను నివారణతోనే అధిగమించవచ్చని తెలిసినా, చాలామందికి ఆ విషయం తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం ఆస్పత్రి ట్రస్ట్ చేపట్టిన ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఓ సారైనా బ్రెస్ట్ కేన్సర్ పరీక్ష చేయించుకోవాలని కవిత కోరారు.