: ఏఓబీ అడవిలోనే ఆర్కే.. 800 మంది బలగాలతో పోలీసుల గాలింపు!
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్టుగా చెబుతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్కే ఇప్పుడు ఎక్కడున్నారనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఆయన నిఘా వర్గాల అదుపులో ఉన్నారా? లేక క్షేమంగా తప్పించుకున్నారా? అన్న విషయంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్ నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని, రక్షణ దళం ఆయనను అక్కడి నుంచి క్షేమంగా తప్పించిందని, ఈ క్రమంలో ఆయన గాయపడ్డారని చెబుతున్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన వారిలో ఆర్కే గన్‌మెన్‌గా భావిస్తున్న ముగ్గురిని గుర్తించారు. తప్పించుకున్న ఆర్కే కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. 800 మంది పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. తప్పించుకున్న ఆర్కేతోపాటు గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది 20 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీసుల జాయింట్ ఆపరేషన్ మొదలు పెట్టారని సమాచారం. ఆర్కేను సజీవంగా పట్టుకోవడమో, లేదంటే మట్టుబెట్టడమో ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో బలగాలు ఉన్నాయి. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కోరాపుట్, మల్కనగిరి, గుమ్మ తదితర ప్రాంతాల్లో ఏకంగా 13 సెక్యూరిటీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.