: తాత ఇచ్చిన బహుమతి.. మనవడి చేతికి వచ్చి కోటీశ్వరుడ్ని చేసింది!
జీవితం అంటే ఏమాత్రం ఊహలకు అందనిదని, దానిని ప్రతిరోజూ యథాతథంగా అనుభవించాలని కొంత మంది పెద్దలు చెబుతుంటారు. లండన్ కు చెందిన ఓ కార్మికుడి జీవితంలో చోటుచేసుకున్న ఓ ఘటనే అందుకు తాజా నిదర్శనం. దాని వివరాల్లోకి వెళ్తే, 300 ఏళ్ల క్రితం బ్యాటిల్ ఆఫ్ విగో (విగో యుద్ధం) లో బ్రిటిష్ సర్కార్ విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా అపురూపమైన 20 విగో నాణేలను ముద్రించారు. వాటిలో 15 నాణేల ఆచూకీ ఇప్పటికీ చిక్కలేదు. 2013లో చివరిసారిగా ఒక విగో నాణేన్ని వేలంలో ఉంచగా దాని ధర 3 లక్షల పౌండ్లు (2.5 కోట్ల రూపాయలు) పలికింది. ఈ క్వీన్ అన్నె విగో ఫైవ్ గునియా నాణేల్లో ఒకదానిని ఈ కార్మికుడికి అతని తాత బహుమతిగా ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా ఉంచుకున్న అతను, దానిని తన తాత తనకు బహుమతిగా ఇచ్చిన నాణెమని చెబుతూ, 'జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో' అంటూ తన నాలుగేళ్ల కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ నాణెం విలువ పెద్దగా తెలియని ఆయనకు ఓ ఆక్షనీర్ ఇప్పుడు దాని విలువను తెలియజెప్పాడు. అది 314 ఏళ్ల క్రిందటి అరుదైన బ్రిటిష్ నాణెమని దాని చరిత్రను వివరించాడు. దాని విలువ ఇంచుమించు 3 లక్షల పౌండ్లు ఉంటుందని చెప్పడంతో ఆయన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. దీంతో ఈ విగో నాణేన్ని వచ్చే నవంబర్ 16న వేలం వేయనున్నారు. అంతవరకు ఈ కార్మికుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచారు.