: త్వరలోనే...ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పట్టాభిషేకం: అంబికాసోనీ
ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను త్వరలోనే రాహుల్ గాంధీ స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ మహిళా నేత అంబికా సోని తెలిపారు. ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వస్తారని తమకు తెలుసని చెప్పిన ఆమె, అయితే ఆయన ఎన్నికకు సంబంధించిన తదుపరి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని తెలిపారు. కాగా, ఇప్పటికే యూపీని చుట్టేసిన రాహుల్ గాంధీ, పంజాబ్, గోవాల్లో ఎన్నికల ప్రచార వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంచితే, రాహుల్ గాంధీకి అండగా ఉండి, పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తామంతా మద్దతిస్తామని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే.