: పాక్ లో వెలసిన పోస్టర్లు... ఉరీ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే తాయిబానే!


జమ్మూకశ్మీర్ లోని ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసింది లష్కరే తాయిబా ఉగ్రవాదులే అన్న పచ్చి నిజం బట్టబయలైంది. పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలాలో వెలసిన పోస్టర్లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉరీ దాడిలో భారత సైనికుల చేతిలో హతమైన ఉగ్రవాది మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక నమాజ్ కు హాజరు కావాలని స్థానికులను ఆహ్వానిస్తూ గుజ్రాన్ వాలాలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై అబూ సిరాఖా ఫొటోనే కాకుండా, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఫొటోను కూడా ఉంచారు. అంతేకాదు, పోరాట యోధుడైన అబూ సిరాఖా ఉరీ క్యాంపులోని 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడని (వాస్తవానికి ఉరీ దాడిలో 20 మంది సైనికులే మరణించారు), మతం కోసం ప్రాణ త్యాగం చేశాడని పోస్టర్ పై పేర్కొన్నారు. గార్ జాఖ్ సమీపంలోని బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నమని, అబూ మృతదేహం లేకుండానే అంత్యక్రియలు జరుపుతున్నామని తెలిపారు. ఈ పోస్టర్లతో, ఉరీ ఉగ్రదాడి లష్కరే తాయిబా పనే అనే విషయం తేటతెల్లమైంది. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని చెబుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు, ఉరీ దాడులు జరిగిన వెంటనే... అవి జైషే మొహమ్మద్ చేసిన దాడులని భారత్ ఆరోపించింది. అయితే, ఆ దాడులకు పాల్పడించి లష్కరే తాయిబా అనే విషయం ఈ పోస్టర్లతో వెల్లడైంది.

  • Loading...

More Telugu News