: చికెన్ బకెట్ ఫుల్ గా లేదంటూ కేఎఫ్ సీపై 20 మిలియన్ డాలర్లకు దావా!


సంబంధిత ఉత్పత్తులకు సంబంధించి టీవీలలో వచ్చే ‘యాడ్స్’ ప్రభావం వినియోగదారులపై ఎంతగానో ఉంటుంది. వారు కొనుగోలు చేసిన ఉత్పత్తి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే సదరు సంస్థపై లేదా ఆ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీపై కోర్టు కేసులు వేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా, ఇటువంటి సంఘటనే జార్జియాలో జరిగింది. యూఎస్ కు చెందిన అన్నా ఉర్ట్జ్ బర్గర్ 20 డాలర్లు విలువ చేసే కేఎఫ్ సీ చికెన్ బకెట్ కు ఇటీవల ఆర్డర్ ఇచ్చింది. ఆమెకు డెలివరీ అయిన దాంట్లో సగం బకెట్ ఖాళీగా ఉండటమే కాకుండా, చికెన్ ముక్కలు చిన్నవిగా కూడా ఉన్నాయి. దీంతో, ఉర్ట్జ్ బర్గర్ కు కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే, జార్జియాలోని సదరు సంస్థ హెడ్ క్వార్టర్స్ కు ఆమె ఫోన్ చేసింది. సంస్థకు సంబంధించిన యాడ్స్ లో పేర్కొంటున్న దానికి, ఇక్కడ జరుగుతున్న దానికి పొంతన లేదని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదుపై స్పందించిన సంబంధిత అధికారులు ఆమెకు క్షమాపణలు చెప్పడంతో పాటు, రెండు గిఫ్ట్ సర్టిఫికెట్లు ఆఫర్ చేశారు. కానీ, 64 సంవత్సరాల ఆ మహిళ వారి క్షమాపణలను, ఆ సర్టిఫికెట్లను తిరస్కరించింది. తనను మోసగించారంటూ సదరు సంస్థపై 20 మిలియన్ డాలర్లకు దావా వేసింది. ఈ సందర్భంగా ‘న్యూయార్క్ పోస్ట్’తో ఆమె మాట్లాడుతూ, ‘కుటుంబం మొత్తానికి సరిపడ చికెన్ ను ఆ బకెట్ లో అందిస్తామని యాడ్స్ ద్వారా కేఎఫ్ సీ చెబుతోంది. చికెన్ తో నిండిపోయిన బకెట్ ను యాడ్స్ లో చూపిస్తోంది. కనుక, ప్రజలు కూడా అదే విధంగా ఆశిస్తారు’ అని చెప్పింది. కాగా, కేఎఫ్ సీ ప్రతినిధులు స్పందిస్తూ, తమపై దావా వేయడం సబబు కాదని అన్నారు.

  • Loading...

More Telugu News