: నాపై టీఆర్ఎస్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు: కోదండరామ్
కాంగ్రెస్ పార్టీ అజెండాను అమలు చేస్తూ, రైతు దీక్షకు దిగారంటూ తనపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుబట్టారు. తనను వెనుక నుంచి ఎవరూ నడిపించడం లేదని ఆయన అన్నారు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని... సాటి మనిషిగా తాను స్పందిస్తున్నానని చెప్పారు. మంచి, చెడులను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. తాను మాట్లాడిన మాటల్లో తప్పుంటే చెప్పండి, సరిచేసుకుంటా అని అన్నారు. టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. టీవీల్లో వచ్చే రాజకీయ చర్చల్లో కూడా... ఎదుటి వారిని దుమ్మెత్తి పోసే సంస్కృతి మంచిది కాదని కోదండరామ్ సూచించారు. ఈ రోజు మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.