: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు.. డొనాల్డ్ ట్రంప్ పై జోకులే జోకులు!


అమెరికా అధ్యక్ష పీఠం కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ‘జిమ్మీ కిమ్మెల్‌ లైవ్‌’ షోలో పాల్గొని ప‌లు చ‌మ‌క్కులు విసిరారు. షోలో మాట్లాడుతూ త‌న భార్య‌ మిషెల్‌ ఒబామాకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పారు. అధ్యక్ష పదవికి పోటీ చేయ‌డానికి ఒకవేళ మూడోసారి కూడా అవకాశం ఉండి, తాను మళ్లీ పోటీ చేస్తే త‌న భార్య తనకు విడాకులు ఇచ్చేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. త‌మ దేశ‌ చరిత్రలోనే ఒబామా చెత్త అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోతారంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒబామా.. షోలో స్పందిస్తూ ట్రంప్ త‌న‌ను కనీసం అధ్యక్షుడిగానైనా దిగిపోతానని అన్నాడ‌ని చమత్కరించారు. వచ్చేనెల‌ 8న జరిగే త‌మ దేశ‌ అధ్య‌క్ష ప‌ద‌వికోసం ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరుగుతుందన్న‌ డొనాల్డ్‌ ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ఒబామా స్పందిస్తూ సెటైర్లు వేశారు. తాను కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రమోషన్స్‌ కోసం కొన్ని రోజుల క్రితం శ్వేత‌సౌధంలో కమెడియన్‌ బిల్‌ ముర్రేతో గేమ్‌ ఆడానని చెప్పారు. అందులో గోల్ఫ్‌ బాల్స్‌ను గ్లాస్‌లో పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ గేమ్‌లో బిల్‌ ముర్రే కొన్ని సార్లు గెలిచారని చెప్పారు. అయితే, గ్లాస్‌ రిగ్గింగ్‌ చేసిందని ఒబామా చ‌మ‌క్కులు విసిరారు. చాలా సార్లు తాను ట్రంప్‌ను టీవీలో చూస్తూ నవ్వుకున్న‌ట్లు ఒబామా చెప్పారు. తాను ప‌లు సార్లు నిద్ర‌పోతున్న స‌మ‌యంలోనూ అత్యవసర ఫోన్‌ కాల్స్‌ తీసుకున్నానని ఒబామా చెప్పారు. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్ చేస్తే పగటిపూట కూడా స్పందన ఉండ‌ద‌ని ఆరోపించారు.

  • Loading...

More Telugu News