: చెన్నైలో డీఎంకే మహిళా నేతపై కత్తితో దాడి చేసిన దుండగులు
చెన్నైలో డీఎంకే పార్టీకి చెందిన ఓ మహిళా నేతపై పలువురు దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. సెయింట్ థామస్ మౌంట్ పంచాయత్ మహిళా శాఖ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తోన్న డీఎంకే పార్టీ నేత రేణుకపై తాంబరం సమీపంలోని బస్టాండ్ వద్ద ఈ దాడి జరిగింది. అక్కడికి కాసేపట్లో స్కూలు బస్సులో రానున్న తన కుమార్తె కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. ఇంతలో ముగ్గురు దుండగులు బైక్పై అక్కడకు వచ్చారు. ఏదో అడ్రసు అడుగుతున్నట్లు నటిస్తూ ఆమె వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా ఆమెను కత్తితో పొడిచారు. వారి బారి నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను దుండగులు వదలకుండా కత్తితో గాయపరిచారు. ఈ సంఘటనను స్థానికులు గమనించి, నిందితులను అడ్డుకోవాలని చూశారు. అంతలో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడకు చేరుకున్న పోలీసులు రేణుకను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.