: శీతాకాల సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేస్తాం.. అయినా లాభం లేకపోతే రాజీనామా చేస్తాం: హోదా కోసం ‘యువ‌భేరి’లో జ‌గ‌న్‌


అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నార‌ని, పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక‌ హోదా హామీని నెర‌వేర్చుకోలేమా? అని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఈ రోజు క‌ర్నూలులో హోదా కోసం నిర్వ‌హిస్తోన్న యువ భేరిలో ఆయ‌న మాట్లాడుతూ... హోదా వచ్చే వ‌ర‌కు పోరాడుదామ‌ని పిలుపునిచ్చారు. తాను ఒక్క‌డినే పోరాడితే స‌రిపోదని, అంద‌రం క‌లిసి పోరాడితేనే హోదా సాధ్య‌మ‌ని అన్నారు. అన్నీ తెలిసే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయని జ‌గ‌న్ అన్నారు. హోదాతో లాభం లేదంటూ చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ‘పోరాటం చేస్తూ ఉంటేనే ఈ రోజు కాక‌పోతే రేప‌యినా హోదా సాధించుకోవ‌చ్చు. రేపు ప్ర‌త్యేక హోదా కోసం పోరాడే వారికే ఎన్నిక‌ల్లో ఓటు వేయాలి. ప్ర‌త్యేక హోదాపై ఒత్తిడి పెంచే దిశ‌గా పై స్థాయిలో మ‌రింత ఉద్ధృతంగా పోరాటం చేస్తాం. రానున్న‌ పార్ల‌మెంటు స‌మావేశాల్లో మా ఎంపీలు హోదా అంశాన్ని అడుగుతారు. శీతాకాల సమావేశాల వరకు చూస్తాం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేస్తాం. అయినా స్పంద‌న రాక‌పోతే మ‌ళ్లీ వ‌చ్చే స‌మావేశాల నాటికి మా ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాం. పార్ల‌మెంటులో మాట ఇస్తే ఆ మాట నిల‌బెట్టుకోలేని వారి తీరుకి నిర‌స‌న‌గా మాకు ఓటేయండి అని ఎవ‌ర‌యినా అడిగితే, వారితో హోదా ఇస్తేనే ఓటు వేస్తాం అని చెప్పండి. హోదాను కచ్చితంగా తీసుకొస్తాం’ అని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News