: చదువుకున్న పిల్లలకు మేలు కలగాలంటే వేరే గత్యంతరం లేదు.. హోదా కావాల్సిందే: యువభేరిలో జగన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవనేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఆయన ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాన్ని గురించి యువతకు తెలియజెప్పడానికి యువభేరి నిర్వహిస్తున్నారు. హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడం కోసం వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేక హోదాపై మాట్లాడిన నాయకులు ఈ రోజు మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నది వాస్తవమని జగన్ అన్నారు. పరిశ్రమల కోసం అప్పుడు హోదా కావాలి అన్న నాయకులే మాటమార్చి ఇప్పుడు హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలకు సంబంధం లేదని చెబుతున్నారని ఆయన అన్నారు. ఆ రోజు మాటిచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారని, పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని అన్నారు. విశ్వాసం, విశ్వసనీయత లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. మాట తప్పిన నేతలను ప్రజలు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. యువభేరి ప్రాంగణం అంతా యువతతో నిండిపోయింది.