: ఈ సారి గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ పేలింది... శాంసంగ్ కు మరో షాక్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ శాంసంగ్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలుతున్న నేపథ్యంలో, ఈ కంపెనీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తాజాగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్స్ ఫోన్ కూడా పేలిపోయిందని అమెరికాలోని ఓ స్థానిక మీడియా వెల్లడించింది. ఒరిజినల్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టినప్పటికీ ఫోన్ పేలిందని... బాధితుడికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయని తెలిపింది. రెండు వారాల క్రితమే నోట్ 7కు బదులుగా ఎస్ 7 ఎడ్స్ ను బాధితుడు తీసుకున్నాడని వివరించింది. మరోవైపు, అమెరికాలోని శాసంగ్ నోట్ 7 వినియోగదారులు పలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. నోట్ 7 మోడల్ ను నిలిపివేయడం, ఆ ఫోన్లను మార్చుకోవాలని కోరడం తమను ఇబ్బందులకు, మానసిక వేదనకు గురిచేసిందని పిటిషన్లలో వారు పేర్కొన్నారు. గెలాక్సీ నోట్ కారణంగా రానున్న ఆరు నెలల్లో శాంసంగ్ కు మూడు బిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.