: పెళ్లి తర్వాత బహుమతులు స్వీకరించడం కట్నం కిందికి రాదు.. అలహాబాద్ హైకోర్టు
పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు బహుమతులు కోరడం వరకట్నం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ డిమాండ్ పునరావృతమైతే మాత్రం వరకట్న వేధింపుల కిందికే వస్తుందని పేర్కొంది. 24 ఏళ్ల క్రితం వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. పెళ్లి తర్వాత పెళ్లి కుమార్తెను వరుడి ఇంటికి పంపే సమయంలో నిర్వహించే హిందూ సంప్రదాయమైన ‘కలేవా’లో పెళ్లి కొడుకు బహుమతులు డిమాండ్ చేయడం తప్పుకాదని కోర్టు అభిప్రాయపడింది. 1987లో రాజేంద్రప్రసాద్ కుమార్తెను రామ్ శంకర్ వివాహం చేసుకున్నారు. మే 30, 1989లో ఆమె కాలిన గాయాలతో మృతి చెందింది. పెళ్లి సమయంలో ఇస్తానన్న టీవీ, బైక్ ఇవ్వలేకపోవడం వల్లే తన కుమార్తెను హత్య చేశారన్న రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సెప్టెంబరు 30, 1992లో అడిషనల్ సెషన్స్ కోర్టు రామ్ శంకర్‌ను దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రామ్ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు తీర్పు వెలువరిస్తూ కలేవా సమయంలో బహుమతులు డిమాండ్ చేయడం వరకట్న వేధింపుల కిందకు రాదని, అదో హిందూ సంప్రదాయమని పేర్కొంది. అయితే పెళ్లి తర్వాత కూడా పదేపదే అదే డిమాండ్ చేస్తే మాత్రం వరకట్న వేధింపుల కిందకే వస్తుందని ధర్మాసనం పేర్కొంది.