: చైనా వస్తువుల బహిష్కరణ కష్టమేనంటున్న విశ్లేషకులు.. భారత్‌కు ఉన్న అతిపెద్ద వ్యాపార మిత్రుల్లో చైనా ఒకటని వ్యాఖ్య
ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ విషయంలో భారత్‌కు మద్దతు పలుకుతూ పాకిస్థాన్ తీరును ఎండగట్టాయి. అయితే పాక్‌తో గట్టి సంబంధాలున్న చైనా మాత్రం ఆ దేశాన్ని వెనకేసుకొచ్చింది. అంతేకాకుండా భారత్‌పై విమర్శలు చేయడం, ఎన్‌ఎస్‌జీని అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత యువత చైనాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఆ దేశ వస్తువులను బహిష్కరించడం ద్వారా దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా చైనా వస్తువుల అమ్మకాలకు కొంతవరకు గండి పడింది కూడా. అయితే చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. దేశానికి ఉన్న అతి పెద్ద వ్యాపార మిత్రుల్లో చైనా ఒకటని పేర్కొంటున్నారు. ఆరోవంతుగా ఉన్న చైనా వస్తువుల దిగుమతి 2011-12లో పదో వంతుకు చేరినట్టు తెలిపారు. ఐదేళ్ల క్రితం ఐదు శాతంగా ఉన్న చైనా వస్తువుల దిగుమతులు గత రెండేళ్లలో 20 శాతానికి పెరిగాయి. వీటి మొత్తం విలువ 61 బిలియన్ డాలర్లు. పవర్ ప్లాంటుల నుంచి గణేశ్ విగ్రహాల వరకు అన్నీ దిగుమతి అవుతున్నాయి. ఇక ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో దిగుమతుల విలువ కూడా తగ్గింది. మరోవైపు భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కూడా తగ్గాయి. 2011-12లో 18 బిలియన్ డాలర్లు(రూ.86వేల కోట్లు) ఉన్న ఎగుమతులు 2015-16లో 9 బిలియన్ డాలర్ల (రూ.58వేల కోట్లు)కు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని తయారీ రంగం క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటుండడంతో చైనాకు దీటుగా వస్తువులను తయారుచేసే సామర్థ్యం లేకుండా పోయింది. అయితే విదేశీ పెట్టుబడుల కారణంగా ఇప్పుడిప్పుడే ఈ రంగం భారత్‌లో ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను ఏకమొత్తంగా బహిష్కరించడం అంత సులభమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో చైనా వస్తువులపై జరుగుతున్న యుద్ధం కారణంగా ఆ దేశ వస్తువుల విక్రయాలు గణనీయంగా పడిపోయినట్టు ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. భారత్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చైనా వెన్నులో వణుకు మొదలైంది. దీంతో ఆ ప్రచారం వల్ల తమకొచ్చిన నష్టం ఏమీ లేదని ఓసారి, భారత్‌కే నష్టమని మరోసారి ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.