: మసూద్ అజర్‌కు షాకిచ్చిన పాకిస్థాన్.. ఉగ్రవాదుల ఐదు వేల బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్
జైషే మహ్మద్(జీఈఎం) చీఫ్ మసూద్ అజర్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. ఉగ్రవాదులువిగా అనుమానిస్తున్న 5,100 బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) కింద ఫ్రీజ్ చేసిన ఈ ఖాతాల్లో ఉగ్రవాది మసూద్ అజర్ అకౌంట్ కూడా ఉండడం గమనార్హం. ఈ ఖాతాల్లో నికర మొత్తం రూ.40 కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్(ఎస్‌బీపీ) ఫ్రీజ్ చేసిన 1200 అకౌంట్లను ఏటీఏలోని ‘ఎ’ కేటగిరీలో చేర్చింది. ‘ఎ’ కేటగిరీని ఉగ్రవాదుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మసూద్ అజర్ అకౌంట్‌ను కూడా ‘ఎ’ కేటగిరీ కింద చేర్చినట్టు అధికారులు పేర్కొన్నారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత పాక్ ప్రభుత్వం అజర్‌కు రక్షణ కల్పించినట్టు పాక్ అధికారులు తెలిపారు. అంతర్గత మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకే మసూద్ అజర్, అతడి కుమారుడు అల్లా బక్ష్ సహా పలువురు టాప్ ఉగ్రవాద అనుమానితుల అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టు వివరించారు. మొత్తంగా ఐదు వేల అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టు నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ నేషనల్ కోఆర్డినేటర్ ఇహ్‌షాన్ ఘనీ పేర్కొన్నారు.