: మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే భారీ నష్టం.. వరుసగా మరణిస్తున్న కీలక నేతలు.. తుడిచిపెట్టుకుపోయిన ఉదయ్ దళం


ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్దదిగా నమోదైంది. దేశవ్యాప్తంగా కొన్ని వందల ఎన్‌కౌంటర్లు జరిగినా ఈసారి మాత్రం మావోయిస్టు పార్టీకి కోలుకోలేనంత ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోలు మృతి చెందగా అందులో పలువురు అగ్రనేతలు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లు.. 1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది పీపుల్స్‌వార్ సభ్యులు మృతి చెందారు. వారంతా దళంలో చేరిన కొత్తవారే. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్ ప్లీనరీపై పోలీసులు దాడిచేసి 17 మందిని మట్టుబెట్టారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులు ఉన్నారు. గిరాయిపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జనార్దన్, మురళీమోహన్ లాంటి నలుగురు అగ్రనేతలను పార్టీ కోల్పోయింది. కరీంనగర్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు కీలక నాయకులు ఉన్నారు. ఆ తర్వాత వరంగల్‌ జిల్లా కౌకొండలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మృతి చెందారు. వీరిలో సుధాకర్ కూడా ఉన్నారు. అలాగే కరీంనగర్‌లో 10 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది, వరంగల్ జిల్లా తుపాకులగూడెంలో 13 మంది, ఖమ్మం జిల్లా పువ్వర్తిలో 11 మంది, చత్తీస్‌గఢ్‌లోని కంచెల్‌లో 18 మంది, ఎర్రగుంటపాలెంలో 12 మంది, నల్లమలలోని సున్నిపెంటలో 11 మంది, గాజుల నర్సాపూర్‌లో 13 మంది, మానాలలో 12 మంది, పద్మక్క ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి చెందారు. ఆయా ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరిద్దరు అగ్రనేతలు ఉన్నారు. సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మాత్రం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక సంఖ్యాపరంగా చూసినా ఇదే పెద్ద ఎన్‌కౌంటర్. ఇప్పటికే మావోయిస్టు పార్టీ మిలటరీ వ్యూహకర్త, కేంద్ర మిలటరీ కమిషన్ బాధ్యుడు పటేల్ సుధాకర్ రెడ్డి, ఆ తర్వాత శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండలరెడ్డి, ఆజాద్ వంటి వారిని కోల్పోయిన పార్టీకి తాజా ఎన్‌కౌంటర్ కోలుకోలేని దెబ్బ తీసింది. సోమవారం జరిగిన ఘటనలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తో పాటు ఆయన దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇది పార్టీని తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక ఆ పార్టీలో యాక్షన్ టీమ్‌లకు నేతృత్వం వహించగలిగే సామర్థ్యం ఉన్నది నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న ఒక్కరే.

  • Loading...

More Telugu News