: బాలీవుడ్ నటి ట్వీట్ కు స్పందించి మరోసారి శభాష్ అనిపించుకున్న సురేష్ ప్రభు
గతంలో వచ్చిన 'హమ్ ఆప్ కే హై కౌన్' హిందీ సినిమాలో వదినపాత్రలో నటించి పేరుతెచ్చుకున్న రేణుకా సహానీ చేసిన ట్వీట్ కు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సత్వరమే స్పందించి శభాష్ అనిపించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ఆద్యుడు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగించుకుంటూ కేంద్ర మంత్రులందర్లో సమర్థుడని అనిపించుకున్నారు. తాజాగా రేణుకా సహానీ తన వదిన రైల్లో ప్రయాణం చేస్తోందని, ఆమెకు సుస్తీగా ఉందని, సహాయం చేయాలని సురేష్ ప్రభును ట్విట్టర్ ద్వారా కోరింది. వెంటనే స్పందించిన అధికారులు కేవలం 15 నిమిషాల్లోనే చాతి నొప్పితో బాధపడుతున్న రేణుకా సహానీ వదినకు వైద్యమందించి తమ గొప్పతనం చాటుకున్నారు. కొటా రైల్వే స్టేషన్ కు వచ్చేసరికి ఆమెకు సరైన వైద్యసహాయం లభించిందని, రైల్వే మంత్రికి ధన్యవాదాలని రేణుకా సహానీ ట్వీట్ చేసింది. కాగా, ఆమె తెలుగులో 'మనీ', 'మనీ మనీ' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.