: చిన్నారి ప్రాణాలు తీసిన ఉల్లిపాయ!
ఉల్లిపాయ మింగిన ఏడాది చిన్నారి ప్రాణాలు పోయిన విషాద సంఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు.. కనహోసాహళ్లి గ్రామానికి చెందిన కల్పేశ్, అర్చనల కూతురు నిత్యశ్రీ శనివారం నాడు ఇంటి వరండాలో ఆడుకుంటోంది. అదేచోట, ఉల్లిపాయలు ఆరబెట్టి ఉన్నాయి. తల్లి అర్చన తమ పక్కింటి వారితో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న ఉల్లిపాయలను చిన్నారి మింగింది. దీంతో, ఉల్లిపాయ గొంతుకు అడ్డుపడటంతో చిన్నారికి ఊపిరాడలేదు. కాస్సేపటికి అక్కడికి వచ్చిన తల్లి, స్పృహతప్పి పడి ఉన్న తన కూతురిని చూసి కంగారుపడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఊపిరాడని చిన్నారి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.