: పురాతన ఇంటి రిపేర్ల కోసం ప్రయత్నిస్తే డాలర్ల సూట్ కేస్ దొరికింది!
అమెరికాలోని క్లీవ్ లాండ్ లో ఈ మధ్య కొనుగోలు చేసిన 1940ల నాటి కట్టడానికి కొత్త హంగులు దిద్ది అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు ఆ ఇంటి యజమాని బ్రానిక్. అందుకోసం రిపేరింగ్ పనులు మొదలు పెట్టాడు. ఆధునికీకరణలో భాగంగా ఆ పురాతన కట్టడంలోని ఒకటి, రెండో అంతస్తుల పనులు ముందుగా చేపట్టారు. ఇంతలో తొలి అంతస్తు బేస్ మెంట్ వద్ద వారికి ఆకుపచ్చ రంగులో పాతకాలం నాటి సూట్ కేస్ ఒకటి కనిపించింది. దానిని తెరిచి చూడగా అందులో మూడు కవర్లు కనిపించాయి. వాటిని తెరిచి చూసిన బ్రానిక్ దంపతులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ కవర్లలో డాలర్ల నోట్లు బయటపడ్డాయి. మొదటి కవర్లో 10 డాలర్ల నోట్లు, రెండో కవర్లో 20 డాలర్ల నోట్లు, మూడో కవర్లో 50 డాలర్ల నోట్లు కనిపించాయి. అంతా కలిపి మొత్తం 23 వేల డాలర్లున్నాయి. ఈ డబ్బుతో పాటు వార్తా పత్రికలు, పలు బిల్లుల కాగితాలు ఉన్నాయి. ఇందులోని వార్తాపత్రికపై తేదీ ఆధారంగా 1951 మార్చి 25న ఈ సూట్ కేసును దాచినట్టు గుర్తించారు. బిల్లులన్నీ 1928-1934 సంవత్సరం మధ్య కాలంనాటివి. వాటిని చూసిన ఆ దంపతులు వెంటనే లాయర్ ను సంప్రదించారు. ఈ హఠాత్పరిణామానికి తొలుత ఆశ్చర్యపోయినా, సరికొత్త అనుభూతిని పొందామని బ్రానిక్ దంపతులు తెలిపారు.