: టేలర్ చేసిన తప్పే నేనూ చేసి బాధపడ్డాను: కోహ్లీ
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ చేసిన తప్పిదమే తాను కూడా చేసి భారీ మూల్యం చెల్లించుకున్నానని టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ తెలిపాడు. మొహలీలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, రాస్ టేలర్ అనుభవిస్తున్న భాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నాడు. మ్యాచ్ లో మనం క్యాచ్ వదిలేస్తే, తరువాత ఆ ఆటగాడు భారీ స్కోరు సాధిస్తే ఆ బాధ వర్ణనాతీతమని చెప్పాడు. గతంలో ఓ సారి తను మెక్ కల్లమ్ క్యాచ్ ను వదిలేశానని, అ మ్యాచ్ లో మెక్ కల్లమ్ 300 పరుగులు చేశాడని, అది తనకు చాలా బాధ కలిగించిందని అన్నాడు. తాను ఆ రోజు అనుభవించిన బాధను టేలర్ నేడు అనుభవించి ఉంటాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా, కోహ్లీ 6 పరుగుల వద్ద ఉండగా, ఇచ్చిన క్యాచ్ ను టేలర్ అందుకోలేకపోయాడు. దీంతో జీవదానం లభించిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. దీంతో మూడో వన్డే గెలుచుకున్న టీమిండియా టోర్నీలో 2-1తో ముందంజ వేసింది.