: గంగాజలంపై ఒట్టేసి చెబుతున్నా.. అఖిలేశ్ కొత్తపార్టీ పెట్టనున్నట్లు చెప్పారు: శివ్‌పాల్ యాదవ్
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో గొడవలు మరింత పెరిగాయి. ఈ రోజు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం సింగ్ తమ పార్టీలో చెలరేగుతున్న విభేదాలను తగ్గించడానికి లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి కోరితే రాజీనామా చేస్తానని ప్రకటించారు. తరువాత శివపాల్ యాదవ్ మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. గంగాజలంపై ఒట్టేసి చెబుతున్నానని, తాను ఇటీవల అఖిలేశ్‌ను కలిసినప్పుడు ఆయన కొత్తపార్టీ పెట్టనున్నట్లు తనతో చెప్పారని ఆయన అన్నారు. అఖిలేశ్ ప్రకటించే కొత్త పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని కూడా తనతో చెప్పారని శివపాల్ అన్నారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ... తన కుటుంబంలో తలెత్తిన ఈ వివాదంతో తాను మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. పార్టీని ఏర్పాటు చేయడానికి తాము ఎంతో కష్టపడినట్లు తెలిపారు. బలహీనతల మీద కాకుండా తమలో తాము పోరాడుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. కొంతమంది రాష్ట్ర మంత్రుల తీరు సైకోపాత్‌ల్లా ఉందని ఆయన అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించలేనివారు మంత్రులుగా ఉండడానికి అర్హులుకాదని ఆయన చెప్పారు. ఈ రోజు వరకు తాను బలహీనుడను కాదని పేర్కొన్నారు. యువత తనను విడిచి వెళుతుందని తాను భావించడం లేదని చెప్పారు. విమర్శలను ఎదుర్కొనలేకపోతే నేతలు కాలేరని ఆయన హితవు పలికారు. శివ్‌పాల్ యాదవ్ తన కోసం పడిన కష్టాన్ని తాను మర్చిపోలేనని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమర్ సింగ్ కూడా తన సోదరుడేనని.. తాను వారిద్దరు లేకుండా ఉండలేనని చెప్పారు. అమర్ సింగ్ చేసిన తప్పులన్నీ క్షమార్హమైనవేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ ఉంటే ఉపయోగం లేదని అన్నారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్‌యాదవ్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వేదికపైకి వెళ్లిన శివ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ అఖిలేశ్ ఓ అబద్ధాల కోరు అని అన్నారు. తరువాత అఖిలేశ్ ఆ సమావేశం నుంచి వెళ్లిపోయారు.