: నగరానికి రావాలంటేనే ఇతర ప్రాంతాల వారు భయపడుతున్నారు: టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్ నగర శాఖ కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా రావుల మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర సర్కారు పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని ఆయన విమర్శించారు. నగరానికి రావాలంటేనే ఇతర ప్రాంతాల వారు భయపడుతున్నారని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే సంక్షేమ పథకాల్లో సర్కారు కోతలు ఎందుకు విధిస్తోందని ఆయన దుయ్యబట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లలో కోత విధించడం భావ్యం కాదని రావుల అన్నారు. రేషన్‌కార్డులను అర్హులందరికీ అందించాలని సూచించారు. కొత్త సచివాలయం నిర్మాణం అంటూ సర్కారు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు.