: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌పై అలనాటి నటి షబానా అజ్మీ విమర్శలు
బాలీవుడ్లో తెరకెక్కిన ‘యే దిల్ హై ముష్కిల్’ మూవీ ఈ నెల 28న విడుదలకు అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది. యూరీలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి జరిపి వారి ప్రాణాలు తీసిన ఘటన అనంతరం బాలీవుడ్ లో పాకిస్థాన్ నటులను మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతోపాటు పలు సినీ నిర్మాణ సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో పాకిస్థాన్ నటుడు నటించడంతో ఈ సినిమాను విడుదల చేయబోమంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించడంతో ఈ విషయాన్ని ఈ సినీ నిర్మాతలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు దృష్టికి తీసుకెళ్లారు. తరువాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. అయితే, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కింద ‘యే దిల్ హై ముష్కిల్’ దర్శక-నిర్మాత కరణ్‌జొహార్ రూ.5 కోట్లు ఇవ్వాలని ఎమ్ఎన్ఎస్ డిమాండ్ చేసింది. ఈ అంశంపై అలనాటి నటి షబానా అజ్మీ దీనిపై స్పందించారు. మహారాష్ట్ర నవ నిర్మాణసేన తీరును తప్పుబట్టారు. వారి డిమాండ్ పట్ల ఫడ్నవీస్ తీరును కూడా ఆమె విమర్శించారు. ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలు రోజుకోమాట మాట్లాడుతుంటారని అన్నారు. మూవీని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేయడానికి సహకరించాల్సిన ఫడ్నవీస్.. ఇద్దరి మధ్య రూ.5 కోట్ల బ్రోకరింగ్ డీల్ కుదిరేలా చేశారని ఆమె విమర్శించారు. ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. సినిమా విడుదల కోసం హోంమంత్రి రాజ్‌నాథ్ నుంచి కూడా హామీ వచ్చిందని, అయితే, ఫడ్నవీస్ దేశభక్తిని రూ.5 కోట్లకు కొనుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఫడ్నవీస్‌కు బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు. తాను రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని, రాజ్‌థాక్రే మాత్రం లేరని ఆమె పేర్కొన్నారు.