: కరణ్ జొహార్ కు రూ. 320 చెక్ పంపిన వ్యాపారవేత్త !
'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలను అడ్డుకోబోమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రకటించడంతో ఆ సినిమా దర్శకనిర్మాత కరణ్ జొహార్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, ఓ వైపు సినిమా విడుదలకు రెడీ అవుతున్నా... మరోవైపు, జనాల నుంచి మాత్రం కరణ్ పట్ల వ్యతిరేకత ఎక్కువవుతూనే ఉంది. తాజాగా రూ. 320 చెక్కును కరణ్ జొహార్ కు కరణ్ చీమా అనే వ్యాపారవేత్త పంపించాడు. జొహార్స్ ప్రొడక్షన్ హౌస్ కు ఈ చెక్కును పంపాడు. చెక్కుతో పాటు ఆయన పంపిన లేఖ... కరణ్ జొహార్ సిగ్గుతో తల వంచుకునేలా ఉంది. " మీరు విడుదల చేసిన వీడియోను చూసి చాలా బాధ పడ్డా. మీరు, మీ సినిమాలో పని చేసిన వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో రూ. 320 చెక్ పంపిస్తున్నా (రెండు టికెట్ల ఖరీదు). ఒక బిజినెస్ మ్యాన్ గా మరో బిజినెస్ మ్యాన్ బాధ ఏమిటో నాకు తెలుసు. పాకిస్థాన్ నటులు నటించిన మీ సినిమాను నేను చూడదలుచుకోలేదు. కానీ, మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే చెక్ పంపిస్తున్నా. పాక్ నటులను పెట్టుకుంటే పాకిస్థాన్ లో కూడా బిజినెస్ జరుగుతుంది. అందువల్ల లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనేది మీ ఉద్దేశం. కానీ, పాకిస్థాన్ వల్ల మన దేశంలోని వేలాది మంది నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు", అంటూ లేఖలో కరణ్ చీమా పేర్కొన్నారు. మరోవైపు, తన సినిమాకు అడ్డంకులు కల్పించవద్దని... సినిమా విడుదల ఆగిపోతే తాను చాలా నష్టపోతానని... సినిమాకు పనిచేసిన వందలాది మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ కరణ్ జొహార్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి, స్పందనగానే కరణ్ జోహార్ కు చీమా చెక్ పంపించారు.