: లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఘర్షణ
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీ చీలిక దిశగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ నుంచి శివపాల్‌ను తప్పించడం.. దాంతో అఖిలేష్‌కు మద్దతుగా నిలిచిన రాంగోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి ములాయం సస్పెండ్ చేయడం.. వంటి సంచలనాలతో ఆ పార్టీ వర్గాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులు, తిరుగుబాటుదారుల మధ్య గొడవ రాజుకుంది. ఈ రోజు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం సింగ్ ఆ కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ములాయం మరికాసేపట్లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ముందు పార్టీకి అనుకూల, వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.