: ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావడానికి కారణం ఇదే...!
న్యూజిలాండ్ తో నిన్న జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు, 80 పరుగులతో దుమ్ము రేపి, భారత్ విజయానికి బాటలు వేశాడు. దీంతో, టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో ధోనీ మాట్లాడుతూ, బ్యాటింగ్ ఆర్డర్ లో తాను ముందుకు రావడానికి గల కారణమేంటో తెలిపాడు. తన బ్యాటింగ్ సత్తా ఏంటో చాటడానికే ముందుకు వచ్చానని మిస్టర్ కూల్ చెప్పాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడం వల్ల... ఎక్కువ సేపు ఆడటానికి అవకాశం ఉండటం లేదని అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా వస్తే, ఎక్కువ సేపు ఆడే వీలుంటుందని చెప్పాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగితే, భారీ షాట్లు ఆడటానికి వీలుంటుందని... దీంతో, తానేంటో నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపాడు. ఏదేమైనప్పటికీ, నిన్నటి మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ కు అభిమానులందరూ ఫిదా అయిపోయారు.