: పారిస్ దాడి సూత్రధారే మా గ్రూప్ లీడర్.. వెల్లడించిన తమిళనాడు యువకుడు
గతేడాది పారిస్లో జరిగిన ఉగ్రదాడిలో 130 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన బెల్జియమ్ దేశస్థుడు అబ్దెల్ హమీద్ అబావూద్ తమ గ్రూప్ లీడర్ అని తమిళనాడుకు చెందిన సుబాహని హజా మొయిదీన్ పేర్కొన్నాడు. తమిళనాడు నుంచి వెళ్లి ఐఎస్ఐలో చేరిన మొయిదీన్ ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి ఇరాక్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 8న చెన్నై నుంచి ఇస్తాంబుల్.. అక్కడి నుంచి పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, ఇతర దేశాలకు చెందిన విదేశీ జిహాదిస్టులతో కలిసి సిరియా చేరుకున్నాడు. ఇరాక్ చేరుకున్నాక తమకు మత బోధనలు చేశారని, ఏకే-47, గ్రనేడ్లు పేల్చడం, బాంబుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారని మెయిదీన్ పేర్కొన్నాడు. పారిస్ దాడికి పథకం రచించిన వారు తమ గ్రూపులోని వారేనని, ఆ దాడి సూత్రధారే తమ గ్రూపు నాయకుడని వివరించాడు. మొయిదీన్ మోకాలి గాయంతో బాధపడుతూ సెప్టెంబరు 22, 2015న టర్కీ మీదుగా భారత్ చేరుకున్నాడు. ఈ నెల మొదట్లో ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను భారత్ వచ్చాక పారిస్ దాడి జరిగిందని, దానికి సూత్రధారి తమ గ్రూపు నాయకుడే అని తెలిసి ఆశ్చర్యపోయానని విచారణలో వెల్లడించాడు. తనకు, ఆ దాడికి ఎటువంటి సంబంధం లేదన్నాడు. మొయిదీన్ను ‘స్లీపర్ సెల్’ సభ్యుడిగా భావిస్తున్న అధికారులు ఐఎస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇక్కడ ఉండేందుకు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాగా ఆర్ఎస్ఎస్ నేతలను, కేరళ హైకోర్టు న్యాయమూర్తులను చంపేందుకు మొయిదీన్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు.