: సమాజ్‌వాదీ పార్టీలో ముసలానికి అమర్‌సింగే కారణమా?


సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు అమర్‌సింగే కారణమా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడైన అమర్‌సింగ్‌ను త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. ఏ ఎన్నికల కోసమైతే ఆయనను తిరిగి తీసుకొచ్చారో ఇప్పుడు అవే ఎన్నికలకు ముందు పార్టీ ఛిన్నాభిన్నం అయిపోతోంది. చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీకి అమర్‌సింగ్ అవసరం ఎంతో ఉందని భావించిన ములాయం సోదరుడు శివపాల్.. ములాయంను ఒప్పించి అమర్‌ను పార్టీలోకి తీసుకున్నారు. అయితే అమర్‌కు రాజ్యసభ సీటివ్వడాన్ని సీఎం అఖిలేష్ వర్గం వ్యతిరేకిస్తోంది. అఖిలేష్‌కు మద్దతుగా ములాయం చిన్నాన్న కుమారుడు రాంగోపాల్ మద్దతు పలుకుతున్నారు. పార్టీలో క్రమంగా విభేదాలు పెరగడంతో నెల రోజుల క్రితం అఖిలేష్ కేబినెట్ నుంచి శివపాల్‌ను తప్పించారు. దీనికి ప్రతీకారంగా అఖిలేష్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించిన ములాయం ఆ పదవిని శివపాల్‌కు అప్పజెప్పారు. అఖిలేష్ అనుకూలురందరినీ పార్టీ పదవుల నుంచి తప్పించారు. దీంతో వివాదం రాజుకుని రచ్చకెక్కింది. పార్టీ రెండుగా విడిపోయింది. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ నేతృత్వంలోని ఖ్వామీ ఏక్తాదళ్‌ను ఎస్పీలో విలీనం చేయడాన్ని కూడా సీఎం అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామాలన్నీ కుటుంబంలో కలహాలకు కారణమయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో అఖిలేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి సీఎం క్యాంపు కార్యాలయానికి మకాం మార్చారు. దీనికి ములాయం పినతల్లి (ములాయం సింగ్ రెండో భార్య) సాధన కారణమని ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ వ్యాఖ్యానించడంతో ములాయం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది జరిగిన రెండు రోజులైనా గడవకముందే అమర్‌సింగ్ అనుకూలురైన ముగ్గురు మంత్రులను సీఎం తొలగించారు. దీంతో రచ్చకెక్కిన విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణంలోనైనా అఖిలేష్ కొత్త పార్టీ పెట్టే సూచలను కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News