: వైసీపీ చీఫ్ జగన్‌కు లేని బుద్ధి ఆ పార్టీ నాయకులకు ఎక్కడి నుంచి వస్తుంది?: టీడీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేని బుద్ధి ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుల నుంచి ఆశించడం తప్పే అవుతుందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గుడ్లగూబలు వెలుగు, గుంటనక్కలు మంచి చూడలేవని అన్నారు. వైసీపీ నాయకుల వ్యవహారం కూడా అలానే ఉందని విమర్శించారు. కోర్టులను అడ్డం పెట్టుకుని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. చెప్పులు కొనుక్కునే స్తోమత లేనివారు ఏకంగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్తున్నారంటే వారి వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స, ఏపీఐసీసీ భూముల కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు మింగిన అంబటికి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని ఆంజనేయులు విమర్శించారు.