: విశాఖ తీరాన, వెంకన్న సన్నిధిలో యువత కేరింతలు... పాల్గొన్న మంత్రులు
ఈ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన నగరాల రోడ్లు యువత కేరింతలతో, నృత్యాలతో ఆనందాన్ని పంచాయి. విశాఖ బీచ్ రోడ్డులో ప్రతి ఆదివారం నిర్వహించే హ్యాపీ స్ట్రీట్, తిరుపతిలో హాఫ్ మారథాన్ కార్యక్రమాలు జరుగగా, యువతీ యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వైజాగ్ లో సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చిన యువత, అక్కడ ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో వినిపించిన పాటలకు మైమరచి పోయి నృత్యాలు చేశారు. వైవిధ్య భరితమైన కార్యక్రమం చూపరులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుపతిలో హాఫ్ మారథాన్ లో భాగంగా 3, 5, 10, 21 కిలోమీటర్ల పరుగు పందాలు జరుగగా, ఏపీ మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోటీదారులను ఉత్సాహపరిచి విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వివిధ తెలుగు, తమిళ చిత్రాల పాటలకు యువతీ యువకులు తమదైన శైలిలో నృత్యాలు చేసి అలరించారు.