: తెలంగాణ వచ్చాక తొలిసారి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన కోదండరామ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జేఏసీ చైర్మన్ కోదండరామ్ తొలిసారిగా దీక్షను చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపిస్తూ, ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాదు, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని ఇందిరా పార్కు వద్ద 'రైతు దీక్ష' చేపట్టారు. ఆయనతో పాటు పలు రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు పాల్గొనడం, పెద్ద ఎత్తున పోలీసులను ఈ ప్రాంతంలో మోహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.