: సోషల్ మీడియాలో బాలికను వేధించిన యువకుడు.. రెండేళ్ల జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా
సోషల్ మీడియా వేదికగా ఓ బాలికను వేధిస్తున్న యువకుడికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరుకు చెందిన గౌడ్ 2015లో లక్ష్య గౌడ్ అనే నకిలీ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ బాలికకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అతడి రిక్వెస్ట్‌ను బాలిక అంగీకరించకపోవడంతో మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. వాటిని కూడా ఆమె పట్టించుకోలేదు. దీంతో కసితో రగిలిపోయిన గౌడ్, ఫేస్‌బుక్ నుంచి ఆమె ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి ఆమెకు పంపించాడు. తర్వాత ఆమెను భయపెట్టి ఫోన్ నంబరు సంపాదించాడు. ఈ ఏడాది మార్చి 17-18 తేదీల్లో ఆమెకు ఫోన్ చేసి తనతో స్నేహం చేయకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అయినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని దోషిగా తేల్చిన కాన్పూరు కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.