: కుమార్తెపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు.. దోషికి 1,503 ఏళ్ల జైలు శిక్ష!
టీనేజ్ కుమార్తెపై నాలుగేళ్లపాటు అత్యాచారానికి పాల్పడిన కిరాతక తండ్రికి అమెరికాలోని ఫ్రెస్నో కోర్టు సంచలన శిక్ష విధించింది. అతడికి ఏకంగా 1,503 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెలువరించింది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోకు చెందిన 41 ఏళ్ల తండ్రి తన కుమార్తెపై అత్యంత పాశవికంగా నాలుగేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే దోషి పేరును ఎక్కడా పేర్కొనలేదు. అతడి పేరు వెల్లడించడం వల్ల కుమార్తెను సులభంగా గుర్తు పట్టే వీలుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వ్యక్తుల వల్ల సమాజానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని జడ్జి ఎడ్వర్డ్ సర్కిసియాన్ జూనియర్ తన తీర్పులో పేర్కొన్నారు. మొదట బాధితురాలు ఫ్యామిలీ ఫ్రెండ్ నుంచి వేధింపులు ఎదుర్కొంది. ఆమెను అతడి నుంచి రక్షించాల్సిన తండ్రే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. తండ్రి పాశవిక చర్య బయటపడడంతో కేసు కోర్టుకు చేరింది. గతనెలలో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ‘‘తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినప్పుడు నేను యుక్తవయసులో ఉన్నా. అతడిని అడ్డుకునే శక్తి కానీ, నన్ను నేను రక్షించుకునే అవకాశం కానీ లేకుండా పోయాయి’’ అని బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం ఆమె వయసు 23 ఏళ్లు. తండ్రి తనపై ఎప్పుడూ జాలి చూపలేదని ఆమె జడ్జికి తెలిపింది. కేసును పూర్తిగా విచారించిన న్యాయస్థానం దోషికి 1,503 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా 12 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఓ రేపిస్టు తండ్రికి ఇటీవల మోంటానా కోర్టు కేవలం 60 రోజుల జైలు శిక్ష విధించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. జడ్జిని తొలగించాలంటూ వేలాదిమంది డిమాండ్ చేస్తున్నారు. అతడికి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజా తీర్పు వెలువడడం గమనార్హం.