: ట్రంప్‌పై ఆగని లైంగిక ఆరోపణలు.. హోటల్ గదికి వస్తే 10వేల డాలర్లు ఇస్తానన్నారని ‘అడల్ట్’ హీరోయిన్ ఆరోపణ
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వెల్లువెత్తుతున్న లైంగిక ఆరోపణలకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న మహిళలను కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించిన కొన్ని గంటలకే మరో మహిళ ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తన గదికి వస్తే 10వేల డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారని పేర్కొంది. ఆమెతో కలిసి ఇప్పటి వరకు ట్రంప్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య 11కు చేరింది. అయితే తాజా మహిళ ఓ ‘అడల్ట్’ నటి కావడం విశేషం. 2006లో కాలిఫోర్నియాలోని లేక్ తాహోయిలో గోల్ఫ్ టోర్నమెంటులో ట్రంప్ పరిచయమయ్యారని జెస్సికా డ్రేక్ అనే అడల్ట్ నటి పేర్కొంది. తనను గోల్ఫ్ కోర్టులో నడకకు ట్రంప్ ఆహ్వానించడంతో మరో ఇద్దరితో కలిసి వెళ్లానని ఆమె తెలిపింది. ఆ తర్వాత తమ అనుమతి లేకుండా ఆయన తనను బలంగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నారని వివరించింది. రూముకు చేరుకున్నాక ట్రంప్ తమను పార్టీకి ఆహ్వానిస్తూ ఫోన్ చేశారని పేర్కొంది. ‘నీకెంత కావాలి?’ అని ప్రశ్నించారని, తన గదికి వస్తే 10వేల డాలర్లు ఇవ్వడంతోపాటు ఇంటికెళ్లేందుకు తన ప్రైవేటు విమానాన్ని వాడుకోవచ్చని ట్రంప్ ఆఫర్ ఇచ్చారని డ్రేక్ వివరించింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ట్రంప్‌తో కలిసి ఉన్న ఫొటోను విడుదల చేసింది. డ్రేక్ ఆరోపణలను ట్రంప్ క్యాంపెయిన్ కొట్టిపారేసింది. అదంతా కట్టుకథ అని, అసలు ఆమెవరో కూడా ట్రంప్‌కు తెలియదని ఓ ప్రకటనలో పేర్కొంది.