: అంగారకుడిని బలంగా ఢీకొట్టి పేలిపోయిన ఐరోపా ల్యాండర్!
అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం యూరప్ పంపిన ల్యాండర్ పేలిపోయిందని నాసా అంచనా వేస్తోంది. అంగారకుడి కక్ష్యలోనే పరిభ్రమిస్తున్న మార్స్ రికానసెన్స్ ఆర్బిటర్ తీసిన చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, ఐరోపా ల్యాండర్ అంగారకుడిని బలంగా ఢీకొట్టి పేలి పోయి ఉంటుందని విశ్లేషించారు. స్కాపెరెల్లీ అనే పేరుతో ఈ ల్యాండర్ ను ఐరోపా ప్రయోగించగా, గత నెల 19న వ్యోమనౌక నుంచి విడిపోయి అంగారక వాతావరణంలోకి ఇది ప్రవేశించిన సంగతి తెలిసిందే. గ్రహాన్ని తాకడానికి ముందే భూమితో సంబంధాలను తెంచుకుంది. తాను దిగాల్సిన ప్రాంతంలోనే స్కాపెరెల్లి ల్యాండ్ అయి పేలిపోయిందని, దీని పారాచూట్ ను సీటీఎక్స్ కెమెరా గుర్తించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారాచూట్ కు కిలోమీటర్ దూరంలో ఇంకో ఆకారం కనిపించిందని, ఇది స్కాపెరెల్లీ ఢీ కొనడం వల్ల ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ల్యాండర్ వేగాన్ని తగ్గించేందుకు వాడిన రాకెట్లు నిర్దేశిత సమయానికన్నా ముందుగా ఆగిపోయి ఉండవచ్చని, దీంతో స్కాపెరెల్లీ దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో అంగారకుడిని ఢీకొని ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.