: అమెరికాపై అతిపెద్ద సైబర్ దాడి... ట్విట్టర్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సహా వందల సైట్ల స్తంభన
నిపుణులు హెచ్చరించినట్టే అమెరికాపై సైబర్ దాడి జరిగింది. మిరాయ్ సాఫ్ట్ వేర్ కోడ్ సాయంతో యూఎస్ సర్వర్లలోకి విజయవంతంగా వైరస్ ను పంపిన హ్యాకర్లు వందల సైట్లను స్తంభింపజేశారు. ట్విట్టర్, అమెజాన్, పేపాల్, నెట్ ఫ్లిక్స్, సీఎన్ఎన్, హెచ్బీఓ, ది గార్డియన్, వైర్డ్ వంటి ప్రముఖ వెబ్ సైట్లన్నీ ఆగిపోగా, తిరిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు నిపుణులు 11 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. న్యూహ్యాంప్ షైర్ కు చెందిన డైన్ కంపెనీ ఐఎస్పీపై దాడితో హ్యాకింగ్ వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ కు అనుసంధానమైన వెబ్ కామ్ లు, రూటర్లు, సెట్ టాప్ బాక్సులు, డీవీఆర్ ల సాయంతో ఈ దాడి జరగడం గమనార్హం. యూఎస్ తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్, కాలిఫోర్నియాలోని లెవల్ 3 సమాచార వెబ్ సైట్లన్నీ వైరస్ దాడికి గురయినట్టు డౌన్ డిక్టేటర్ డాట్ కామ్ వెల్లడించింది. యూరప్ లోనూ పలు వెబ్ సైట్లు నిలిచిపోయాయి. వివిధ రకాల చెల్లింపుల నిమిత్తం ప్రయత్నించిన వారు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. హ్యాకర్లు చాలా తెలివిగా దాడులు చేశారని డైన్ అధికార ప్రతినిధి కైలే యార్క్ వెల్లడించారు. ఒకసారి సమస్యను పరిష్కరించగానే, మరోసారి దాడి జరిగిందని వివరించారు. కాగా, హ్యాకింగ్ తీవ్ర స్థాయిలో ఉండటంతో యూఎస్ అంతర్గత భద్రతా విభాగం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించింది.