: ప్రపంచ కబడ్డీ కప్ మనదే... వరల్డ్ కప్ హ్యాట్రిక్ విజేతగా భారత్!


గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కబడ్డీ ప్రపంచకప్ ను గెలుచుకుని సత్తాచాటింది. వరుసగా మూడు సార్లు కబడ్డీ ప్రపంచకప్ గెలుచుకుని భారత్ రికార్డు నెలకొల్పింది. లీగ్ ప్రారంభ దశలో భారత్, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేతిలో ఓటమి పాలై టోర్నీలో ఆసక్తి రేపింది. అనంతరం వరుస విజయాలు నమోదు చేసిన భారత కబడ్డీ జట్టు నిన్న జరిగిన సెమీఫైనల్ లో థాయ్ లాండ్ జట్టును ఓడించి ఫైనల్ లో ఇరాన్ తో తలపడింది. కబడ్డీ ప్రపంచకప్-2016 అంతిమపోరులో మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు దూకుడుగా ఆడాయి. తొలి అర్ధభాగంలో ఆచితూచి ఆడిన ఇరు జట్లు, ద్వితీయ అర్ధభాగంలో అనవసర తప్పిదాలకు పోకుండా జాగ్రత్తగా ఆడాయి. తొలి దశలో ఇరాన్ 10-07 పాయింట్లతో లీడ్ లోకి వెళ్లగా, సూపర్ టాకిల్ తో భారత జట్టు మ్యాచ్ గతిని మార్చేసింది. తొలి అర్ధం భాగం ముగిసేసరికి ఇరాన్ జట్టు వరుస రైడ్లతో భారత ఆటగాళ్లను బెంబేలెత్తించి, అలౌట్ చేసింది. దీంతో తొలిభాగం ముగిసేసరికి ఇరాన్ 18-13 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రెండు జట్లు ప్రణాళిక ప్రకారం జాగ్రత్తగా ఆడాయి. రెండో అర్ధభాగం ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లకు బోనస్ పాయింట్లను ఇవ్వకుండా ఉండేందుకు ఇరాన్ అన్ని ప్రయత్నాలు చేసింది. రెండో అర్ధ భాగంలో జూలు విదిల్చిన భారత ఆటగాళ్లు ఎదురుదాడికి దిగి 21-20 పాయింట్ల ఆధిక్యం సంపాదించారు. రైడర్ అజయ్ ఠాకూర్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించడమే కాకుండా, ఇరాన్ ను అలౌట్ చేసి, భారత ఆధిక్యాన్ని 24-21 కి పెంచాడు. ఇక భారత్ వెనుకబడకుండా దూకుడుగా ఆడి 38-29 పాయింట్ల తేడాతో భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది.

  • Loading...

More Telugu News