: ఆ ఊరు సరిగమలకు నిలయం.. ఎక్కడ చూసినా గానరసమే!


ఆ గ్రామంలోకి అడుగుపెట్టగానే వీనుల విందైన సంగీతం వినిపిస్తుంది.. ఏ ఇంటి తలుపు తట్టినా సరిగమలు పలుకుతాయి... ఏ మనిషిని కదిలించినా రాగయుక్తంగా పాడతాడు.. పంజాబ్ లోని లూథియానా జిల్లాలోని భాయినీ సాహిబ్‌ అనే చిన్న గ్రామం కథ ఇది. ఆ గ్రామాన్ని ఒక సంగీత సాగరం అని చెప్పచ్చు. ఆ ఊరిలో రైతులు, బ్యాంకర్లు, టీచర్లు, దుకాణదారులు, వస్త్రవ్యాపారులు, పాలవ్యాపారులు, టైలర్లు.. ఎవరిని కదిపినా సంగీతం ఉబికి వస్తుంది. సంగీత ప్రపంచానికి చెందిన ప్రతి విషయాన్ని ఆ గ్రామ ప్రజలు ఔపోసన పట్టారు. సిక్కుల్లో నామ్‌ ధారి తెగకు చెందిన సద్గురు ప్రతాప్‌ సింగ్‌ 19వ శతాబ్దంలో భాయిని సాహిబ్‌ గ్రామంలో పిల్లలందరినీ రేపటి సంగీత విద్వాంసులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని భావించి, సంగీత పాఠశాలను ఏర్పాటుచేశారు. గ్రామంలోని పిల్లలను చేరదీసి ఉచితంగా బోధించడం ప్రారంభించారు. పిల్లల ఇష్టాలనుబట్టి గాత్రం, తబలా, వయోలిన్, షెహనాయ్ వంటి వాయిద్య సాధనాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ గ్రామాన్నే ఆయన ఎంచుకోవడానికి ప్రధానం కారణం ఏంటంటే.. స్వాతంత్ర్యోద్యమ సమయంలో పంజాబ్‌ లో ఈ గ్రామానికి చెందిన ప్రజలే ఎక్కువమంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ గ్రామానికి చెందిన చాలా మంది అమరులయ్యారు. దీంతో వారికి ఏదైనా చేయాలని భావించిన సద్గురు ప్రతాప్ సింగ్ ఆ గ్రామీణులందరికీ సంగీత పాఠశాల పెట్టి, ఉచితంగా సంగీతం నేర్పించి వారిని ప్రయోజకులు చేయాలని భావించారు. 1959లో సద్గురు ప్రతాప్‌ సింగ్‌ మరణించడంతో, సంగీత పాఠశాల బాధ్యతను ఆయన కుమారుడు సద్గురు జగ్జీత్‌ సింగ్‌ స్వీకరించారు. గ్రామంలో సంగీత శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులను దేశంలో పేరున్న సంగీత విధ్వాంసుల వద్దకు తీసుకెళ్లి వారి వద్ద జాయిన్ చేసేశారు. అలా ఈ గ్రామానికి చెందిన ఎంతో మంది ఉత్తమగాయకులుగా రూపుదిద్దుకున్నారు. గ్రామం విడిచివెళ్లని వారు స్థానికంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి వారసులు కూడా ఈ సంగీత పాఠశాలలో విద్యనభ్యసించి విద్వాంసులుగా రూపుదిద్దుకుంటున్నారు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తార్‌ షెహనాయ్‌ ప్లేయర్‌ కిర్‌ పాల్‌ సింగ్, తబలా మాస్టర్‌ సుఖ్విందర్‌ సింగ్, రబాబ్‌ ప్లేయర్‌ హరిజిందర్‌ సింగ్, దిల్‌ రుబా ప్లేయర్‌ దేవీందర్‌ సింగ్‌ ఈ గ్రామానికి చెందినవారే కావడం విశేషం.

  • Loading...

More Telugu News