: నిన్న ఓ ఛానల్‌లో ప్రసారమైన కథనం అబద్ధాల పుట్ట: 'టీఆర్ఎస్'పై రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణలో ఎన్నికలు పెడితే మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితే తిరుగులేని విజయం సాధిస్తుందంటూ ఓ సర్వే వెల్లడించిన అంశాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. ఈ రోజు ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆ సర్వే అంతా బోగస్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. ప్రసార సాధనాలను బెదిరించి సీఎం కేసీఆర్ ఇటువంటి కథనాలు ప్రసారం అయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. సెంటర్ ఫర్ సెఫలాజీ స్టడీస్ సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా నిన్న రాత్రి ఓ ఛానల్‌లో కథనాలు ప్రసారమయ్యాయని, అదంతా అసత్యమేనని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరచిన కేసీఆర్ ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పూర్తి నిర్లక్ష్యం కనపరుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను కేసీఆర్ మోసగిస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాలను అమలు పర్చడం లేదని అన్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.